ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు..
ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు
చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు..
కడప మేజర్ న్యూస్
కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినుల ప్రతిభను ప్రోత్సహిస్తూ సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలో గత సెమిస్టర్ పరీక్షల్లో విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థినులకు శ్రీ కోటిరెడ్డి రామసుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలను అందజేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకుల వారసులు ఎన్. వివేకానందరెడ్డి, టి. రమ్యస్మిత ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో మరింతగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విద్యాభివృద్ధికి ట్రస్ట్ ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత, అధ్యాపక బృందం మాట్లాడుతూ విద్యార్థినుల ప్రతిభను గుర్తించి ప్రతి ఏటా ప్రోత్సహిస్తున్న కోటిరెడ్డి రామసుబ్బమ్మ ట్రస్ట్ వారసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పురస్కారాలు విద్యార్థినుల్లో ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ట్రస్ట్ ప్రతినిధులకు, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత, ట్రస్ట్ వారసులు ఎన్. వివేకానందరెడ్డి, టి. రమ్యస్మిత, వైస్ ప్రిన్సిపాల్ గురువిరెడ్డి, అకడమిక్ సమన్వయకర్త నాగమునిరెడ్డి, ఐక్యూఏసీ సమన్వయకర్త కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు..