telanagana
విద్యుత్ పొదుపుతో బిల్లుల భారం తగ్గించుకోవాలి - ఎస్ఈ ఉత్తమ్ జాడే
సూర్య,కాగజ్నగర్ :పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే శుక్రవారం పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపుతో బిల్లుల భారం తగ్గడంతో పాటు విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.ఏసీలను 24 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగించాలని సూచించారు. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆపివేయాలని, కొత్త విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు అధిక నక్షత్ర రేటింగ్ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఫ్రిజ్ తలుపును ఎక్కువసేపు తెరిచి ఉంచకుండా జాగ్రత్తపడాలని, గీజర్లు, వాటర్ హీటర్లు వంటి పరికరాలను అవసరమైనప్పుడే ఉపయోగించాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో అనవసర వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు.
ప్రతి యూనిట్ విద్యుత్ విలువైనదే. అవసరమైనంత విద్యుత్ మాత్రమే వినియోగిస్తూ వృథాను అరికట్టాలి. విద్యుత్ పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే కుటుంబాలకు బిల్లుల ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు అని ఎస్ఈ ఉత్తమ్ జాడే పేర్కొన్నారు.