వయోవృద్ధులకు లయన్స్ క్లబ్ సంపూర్ణ సహకారం : టౌన్ అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్
నారాయణపేట, సూర్య న్యూస్: వయోవృద్ధులకు లయన్స్ క్లబ్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆ సంఘం టౌన్ అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా సింగారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320ఏ అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమం కోసం లయన్స్ క్లబ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు లయన్స్ క్లబ్ తన వంతు తోడ్పాటును అందిస్తుందని సభాముఖంగా తెలియజేశారు. అలాగే వయోవృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ, వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా వచ్చే దశ అని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో, గౌరవంతో చూసుకోవాలని కొడుకులు, కుమార్తెలకు సూచించారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, మానవత్వం మరియు కుటుంబ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ ఆత్మారామ్ ఎడ్కే, కార్యక్రమ నిర్వాహకులు నరసింహులు, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, వయో వృద్ధులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట