ఉప్పులపల్లి యువకుడు రాకేష్ దారుణ హత్య
వివాహేతర సంబంధమే కారణం..!?సూర్య, హుజూరాబాద్ :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని పెద్ద పాపాయ్య పల్లి గ్రామ పరిధిలో ఎస్సారెస్పీ కెనాల్ లో ఆదివారం రాత్రి వడిగె రాకేష్ (32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..... కమలాపూర్ మండలం ఉప్పుల పల్లె గ్రామానికి చెందిన వడిగె రాకేష్ ను అదే గ్రామానికి చెందిన సమీప బంధువు అంబరగొండ ప్రశాంత్ హత్య చేసాడు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మూలంగా గ్రామంలో కాకుండా హనుమకొండ లో ఉంటున్న రాకేష్ ను పథకం ప్రకారం హుజురాబాద్ పట్టణానికి రప్పించి ఓ డాబాలో మద్యం తాగించిన అనంతరం పెద్ద పెద్దపాపయ్యపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద కత్తితో దారుణంగా హత్య చేసి కెనాల్ లో వేశారని తెలుస్తుంది. కాగా హత్య చేసిన ప్రశాంత్ పోలీసులకు లొంగిపోయాడని ప్రచారం జరిగింది. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. రాకేష్ కు ప్రశాంత్ భార్యకు వివాహేతర సంబంధం ఉండడం గతంలో ఈ విషయం పై గ్రామంలో అనేక సార్లు పంచాయతీలు జరిగాయని , అందుకోసమే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. ఈ హత్య ప్రశాంత్ ఒక్కడే చేశాడా...? ఆయనకు సహకరించిన వారెవరు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.