ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య
శంషాబాద్‌లోని సిద్ధేశ్వర్ కాలనీలో 19 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బూర నర్మద అనే యువతి తన అక్క నివాసంలోని బెడ్‌రూమ్‌లో ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలంలో చేతిరాతతో కూడిన ఓ నోట్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నోట్‌లోని వివరాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నర్మద సిద్ధార్థ్ బేజని గౌడ్ అనే యువకుడిని ప్రేమించినట్లు తెలుస్తోంది. సుమారు 15 రోజుల క్రితం సిద్ధార్థ్ ప్రమాదంలో మృతి చెందడంతో నర్మద తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెల్లడించారు.
- పోతుల నరసింహ : మేజర్ న్యూస్, శంషాబాద్.