విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు
షార్ట్ పోల్స్‌తో షాక్..!
విద్యుత్ స్తంభాలే ప్రమాద ఘంటికలు..
ప్రమాదం ముంచుకొస్తున్నా.. అధికారుల్లో చలనం ఏదీ..?
కడియం: కడియం విజయ టాకీస్ ఎదురుగా ఉన్న నివాస ప్రాంతంలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రస్తుతం రోడ్లు, భవనాల అభివృద్ధికి అనుగుణంగా పొడవు సరిపోని ‘షార్ట్ పోల్స్’గా మారాయి. దీంతో వైర్లు ప్రమాదకర స్థాయిలో కిందకు వేలాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రతిరోజూ చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ఈ పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాలనీ ప్రధాన మార్గంలో ఉన్న పాత ఇనుప విద్యుత్ స్తంభాలు సైతం ప్రమాదకరంగా మారాయని అంటున్నారు.
సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడియం విద్యుత్ శాఖలో రెగ్యులర్ అధికారి లేకపోవడం, ఇన్చార్జి ఏఈతోనే బాధ్యతలు కొనసాగుతుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణపై ప్రభావం పడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించి చేతులు దులుపుకోవడం కాదు.. ప్రమాదం జరగకముందే నివారించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో తక్షణ తనిఖీ నిర్వహించి, షార్ట్ పోల్స్‌ను మార్చి, వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోతే ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సమస్య తమ దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోతే.. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నిస్తున్నారు.