ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర కేబినెట్ భారీ తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ డీఏల (Dearness Allowance) అంశంపై చర్చించి, ఒకేసారి రెండు డీఏల విడుదలకు ఆమోదం తెలిపినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాలను వివరంగా వెల్లడించారు:
* ఉద్యోగుల డీఏల ఆమోదం: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల రెండు డీఏల (DA) విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
* ఎల్‌నినో కరువు పరిస్థితులపై సుదీర్ఘ చర్చ: రాష్ట్రంలో వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన పరిస్థితులపై మంత్రిమండలి సుదీర్ఘంగా సమీక్షించింది. బాధితులను, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై చర్చించారు.
* త్వరలోనే అఖిలపక్ష భేటీ: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి తదితర సమస్యలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించేందుకు త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
* కేంద్రంతో సంప్రదింపులు: కరువు సహాయక చర్యలు మరియు రాష్ట్రంలో ప్రాజెక్టులకు కావలసిన నిధులు, అనుమతుల కోసం త్వరలోనే ప్రజాప్రతినిధులు, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుందని మంత్రి తెలిపారు. అక్కడ కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.