రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు.. ఎల్‌నినో ప్రభావంపై సబ్ కమిటీ నివేదిక
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, వాతావరణ శాఖ సూచనల ప్రకారం మున్ముందు కూడా వర్షాలు పడే అవకాశం తక్కువగానే ఉందని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని, అదే సమయంలో ఎండల తీవ్రత మరియు వ్యవసాయ, గృహ అవసరాల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఎల్‌నినో ముప్పు మరియు కరువు పరిస్థితులపై ఏర్పాటైన సబ్ కమిటీ త్వరలోనే సమగ్ర నివేదిక తయారు చేయనుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రజాప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరిస్తుందని మంత్రి తెలిపారు.
మరోవైపు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22A నిషేధిత జాబితా పరిధిలో ఉన్న భూముల్లో లేఅవుట్లు, నివాస భవన నిర్మాణ అనుమతులపై నెలకొన్న చిక్కు ముడులను విప్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ అంశంపై రాబోయే కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నామని పొంగులేటి వివరించారు.