టీజీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు
లైసెన్స్ రద్దు చేసినా తెరిచిన నిర్వాహకులు..
హైదరాబాద్, సూర్య ప్రతినిధి : టీజీ సేఫ్ అధికారులు జారీ చేసిన నోటీసులను కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. నిన్న పలు హోటళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు.
అయితే లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కొందరు నిర్వాహకులు హోటళ్లను తిరిగి తెరవడం చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినప్పటికీ, ఇవాళ మళ్లీ రెస్టారెంట్‌ను తెరిచినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, అక్కడ ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించినప్పటికీ, వాటిని తినేందుకు ప్రజలు ఎగబడిన దృశ్యాలు కనిపించాయని సమాచారం. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తూ లైసెన్స్ రద్దు చేసిన సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.