పల్లెల అభివృద్ధే లక్ష్యం.. ప్రతి గ్రామానికీ ప్రగతి ఫలాలు
- రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుర్తుపట్టి రవికుమార్
- రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో భారీగా అభివృద్ధి పనులు
- 29న రామాపురంలో పల్లె పండుగ 3.0కు శ్రీకారం
- గ్రామీణ మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
- హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్
- కనిగిరి నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పిలుపు
పామూరు, మేజర్ న్యూస్ : ప్రతి గ్రామానికీ ప్రగతి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 ద్వారా భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ–3.0 పనులకు శ్రీకారం చుట్టనున్నారు.పామూరులోని పువ్వాడి రాధాకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ–3.0లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, 29న రామాపురంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి జనసమీకరణ, రవాణా, సదుపాయాలపై నాయకులు చర్చించారు.పల్లె పండుగ–3.0లో భాగంగా రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించనున్నారు. పాడి రైతులకు అండగా రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాల నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో తోటల పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు.
రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు, రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు చేపట్టనున్నారు. కేంద్ర వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.5,694 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీబీ–జీ రామ్ జీ కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ తదితర నిధుల ద్వారా మరో రూ.2 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు.
పల్లె పండుగతో మారుతున్న గ్రామాల రూపురేఖలుపల్లె పండుగ–1.0లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,514 పశువుల షెడ్లు, 21 వేల వ్యవసాయ పంట కుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టారు. పల్లె పండుగ–2.0లో 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించారు. ఇప్పుడు పల్లె పండుగ–3.0తో గ్రామాల్లో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
రామాపురం కార్యక్రమానికి భారీగా తరలిరావాలి ఎమ్మెల్యే ఉగ్ర
ఈ నెల 29న రామాపురంలో జరిగే పల్లె పండుగ–3.0 ప్రారంభ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జనసమీకరణను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కార్పొరేషన్ చైర్మన్ కె.కె.చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, గుంటుపల్లి శ్రీనివాసులు, యారవ శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, యాదాల వెంకట సాయి కిరణ్, షేక్ గౌస్ బాషా, పందిటి హరీష్, దయిండే శివశంకర్, ఆరెకొండ హరిప్రసాద్, మోరు బోయిన నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.