తాండూరు 9వ వార్డులో దీప నర్సింహులు ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సంబరాలు ధూమ్‌ధామ్‌గా నిర్వహించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మ పాటలు, కోలాటాలతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా దీప నర్సింహులు నివాసం నుంచి మహిళలు బతుకమ్మలతో బయలుదేరి తాతా మందిరం వరకు సంప్రదాయ పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళ్లారు. ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై బతుకమ్మను ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, ఘనమైన ఏర్పాట్లు మహిళలను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పలువురు మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు దీప నర్సింహులు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలు, నాయకులు, వార్డు ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.