శాస్త్రీయ సాగుతోనే పత్తి రైతులకు అధిక దిగుబడులు
తల్లంపాడులో పత్తి రైతులకు కేవీకే శాస్త్రవేత్తల శిక్షణ
చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై అవగాహన
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ, చీడపీడలను సమర్థవంతంగా నియంత్రించి అధిక దిగుబడులు సాధించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు రెవెన్యూ పరిధిలో ఎంసీపీ–కపాస్ కాంతి పథకంలో భాగంగా నిర్వహించిన క్షేత్ర సందర్శనలో రైతులకు పత్తి సాగుపై శిక్షణ, అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పత్తి పంటలో అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు పద్ధతులు, సమగ్ర యాజమాన్య విధానాలు, చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలను శాస్త్రవేత్తలు వివరించారు. పంట ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెగుళ్లు, పురుగుల ఉద్ధృతిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ పత్తి సాగులో మెరుగైన ఫలితాలు సాధించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), స్థానిక రైతులు పాల్గొన్నారు.