విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి.. మొత్తం 20 మంది నిందితుల అరెస్ట్ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి, వారిని నిర్బంధించి, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మొత్తం 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మంగళవారం మరో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాయిపేట్ గ్రామంలో అక్టోబర్ 10వ తేదీ ఉదయం గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసు సిబ్బందిపై ఈ దాడి జరిగింది. సిరికొండ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 90/2026, ఎన్ డి పి ఎస్ చట్టం కింద ఉన్న గంజాయి కేసు దర్యాప్తు నిమిత్తం ఇచోడా సీఐ సీహెచ్. రమేష్, కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్తో పాటు మరో ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రభుత్వ పోలీసు వాహనంలో బంగారుపేట గ్రామానికి వెళ్లారు.గంజాయి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యంలో, కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు, పోలీసు సిబ్బందిపై కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు, వారిని బలవంతంగా సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.అంతేకాకుండా పోలీసులను చంపుతామని బెదిరించడం, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఫోన్ను ధ్వంసం చేయడంతో పాటు మరో సెల్ఫోన్, క్రైమ్ నంబర్ 79/2026కు సంబంధించిన సీడీ ఫైల్ను అపహరించినట్లు తెలిపారు.ఈ ఘటనలో కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఎడమ చేతికి ఎముక విరగగా, ఇచ్చోడ సీఐ సీహెచ్. రమేష్ భుజం, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. ఏఎస్ఐ రాథోడ్ బలిరామ్ ఎడమ చేయి, తొడ, భుజానికి గాయాలయ్యాయి. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భీంరావుకు కుడి చేయి, నడుము భాగాల్లో గాయాలు కాగా, ఏఆర్ కానిస్టేబుల్ గంగారాంకు తలపై రక్తస్రావ గాయమైంది.ఈ ఘటనపై కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 92/2026 కింద బి ఎన్ ఎస్ సెక్షన్లు 109, 303(2), 137, 121, 140, 191 ఆర్ /డబ్ల్యూ 190 మరియు ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టం (పీడీపీపీ యాక్ట్ ) సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఇచ్చోడ పోలీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించి, దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేశారు. దాడిలో పాల్పడిన ఇతరుల పాత్ర పై దర్యాప్తు కొనసాగుతుందని, దాడిలో పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని తెలియజేశారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ: పోలీసు సిబ్బంది చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్ పాల్గొన్నారు.