మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ‘వాశి’ చిత్రంలో లాయర్‌గా అద్భుతమైన నటనతో మెప్పించిన కీర్తి సురేష్, ఈ చిత్రంలో మరోసారి లాయర్ పాత్రలో కనిపించనున్నారు. చిన్నప్పటి నుంచి లాయర్ కావాలనే కోరికతో ఇంట్లో వాళ్ల ఒప్పుకోకపోయినా లా చదివిన సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కోర్టులో ఆమె చేసే వాదనలు, జడ్జిలకు కోపం తెప్పించే తీరు టీజర్లో నవ్వులు పూయిస్తున్నాయి. తన కెరీర్లో ఆదర్శంగా భావించే పెద్ద లాయర్‌తో తలపడాలని భావించే సావిత్రి ప్రయాణం ఎలా సాగింది, ఆమె జీవితంలో ఎదురైన సవాళ్లు ఏమిటనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ రూపుదిద్దుకుంది.
కేవలం సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా కాకుండా చక్కటి వినోదంతో కూడిన విభిన్న కథాంశంతో ఈ సినిమా వస్తున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. సినిమాలోని విజువల్స్ మరియు నేపధ్య సంగీతం కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. నవంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. వరుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న కీర్తి సురేష్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.