సీఎం సభకు సర్వం సిద్ధం
సీఎం సభకు సర్వం సిద్ధం
-సిరిసిల్లలో ముస్తాబైన సభా వేదిక
-అంబేద్కర్ చౌరస్తా నుంచి వేదిక వరకు ఫ్లెక్సీల సందడి
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ధి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
-భారీ ఎల్ఈడీ తెరలు.. విఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు
సభా వేదిక వెనుక అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, ప్రజలు, విఐపీలు కూర్చోవడానికి వేర్వేరుగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అందరూ స్పష్టంగా చూసేందుకు, వినేందుకు వీలుగా సభా ప్రాంగణం చుట్టూ భారీ ఎల్ఈడీ డిస్ప్లేలను అమర్చారు.
-దారి పొడవునా ఫ్లెక్సీల జోరు
మరోవైపు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సభా వేదిక వరకు సాగే పాదయాత్ర మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలతో దారి పొడవునా కాంగ్రెస్ మూడు రంగుల జెండాల సందడే కనిపిస్తోంది. సీఎం రాక సందర్భంగా సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.