ఈ-చలానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన
అనంతపురం బ్యూరో
అనంతపురం: వాహనదారులకు సంబంధించిన ఈ-చలానాల మొత్తాలను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని ఆటో యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద నిన్న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ-చలానాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఈ-చలానాలను రద్దు చేయాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రాజేష్ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి బి. కృష్ణుడు, నగర అధ్యక్షుడు జి. చిరంజీవి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ నాయక్, రాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎస్‌కే రమేష్, రమేష్ నాయక్, నరసింహ, నాగరాజు, శ్రీరాములు, అఖిల్, దాదా, పీరా, రఫీ, సీనా, వెంకటేష్, వలి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.