రాముడైనా.. శివుడైనా ఆరాధ్య దైవాలే
చౌటుప్పల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రతిరూపంతో ఏర్పాటు చేసిన గుమ్మడికాయను పగులగొట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రీరాముడిని ధనికులకు, శివుడిని పేదలకు ప్రతీకగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని కోరారు. దేవతలను రాజకీయాలకు ఉపయోగించకుండా అన్ని మతాల ఆరాధ్య దైవాలను సమానంగా గౌరవించాలని డిమాండ్ చేశారు. ‘రాముడైనా.. శివుడైనా మా ఆరాధ్య దైవాలే’ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్యయాదవ్, రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, సీనియర్ నాయకుడు రమణగోని శంకరయ్య, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేశం, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, పలువురు సర్పంచులు, బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.