సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్
సూర్య నస్పూర్ ;మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్, మున్సిపల్ కమిషనర్ జి.అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం వంటి మార్గాల ద్వారా దేశ ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య సాధన కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని మేయర్ సూచించారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.