రేపు గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు హాజరుకానున్నారని ఆమె వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పడంతో పాటు మహిళల ఐక్యత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీక అని ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళలందరూ ఐక్యంగా పాల్గొని తెలంగాణ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి స్వర్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమ వివరాలు: ఈ నెల 14వ తేదీ, బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.