కూలీల ఆటోను ఢీకొన్న కారు - 9 మందికి తీవ్ర గాయాలు - క్షతగాత్రులందరూ డిసిపల్లి వాసులే
మర్రిపాడు మేజర్ న్యూస్ : మర్రిపాడు మండలంలోని నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై గంగుంట ప్రాంతం వద్ద మంగళవారం కూలి పనులు చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా ఓ కారు అకస్మాత్తుగా ఢీ కొట్టింది. దీంతో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని డి.సి.పల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు చుంచులూరులో జామాయిల్ చెట్లు నాటే పని ముగించుకుని, నందవరం గ్రామానికి చెందిన పెంచల్ రెడ్డి ఆటోలో తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా గంగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇదే తరుణంలో జొన్నవాడ ఆలయం నుండి కర్నూలుకు వెళ్తున్న TS 09 FA 4380 నంబరు గల కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు కాలు ఫ్రాక్చర్ కాగా ఆటోలో ప్రయాణిస్తున్న డీసీ పల్లి గ్రామానికి చెందిన గంగాభవాని, రమణమ్మ, లత, అరుణ, శ్రీను, వెంకటకృష్ణ, జయంతి, హజరత్ లకు తీవ్ర గాయాలవగా వారిలో మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది . ఈ ప్రమాదం జరిగిన వెంటనే రహదారిలో వెళ్లేటటువంటి ప్రయాణికులు 108 కు సమాచారం అందించడంతో ఈఎంటి ఫణి కుమార్, పైలెట్ పెంచల్ రెడ్డి లు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో పాటుగా మర్రిపాడు ఎస్ఐ బలరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.