ఈ-ఆటోల ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో ఈ-ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ఈ-ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, ఇంటింటి నుంచి చెత్త సేకరణను సులభతరం చేయడం, చెత్తను సక్రమంగా తరలించడం వంటి లక్ష్యాలతో ఈ-ఆటోలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
వీటి ద్వారా మున్సిపల్ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి, వీధులు, రహదారులు, నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వీలవుతుంది. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, రోడ్లపై మరియు కాలువల్లో చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి సూచించారు. అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పట్టణంలో నిరంతర పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా