రాంపూర్ గ్రామంలో దుర్గాదేవికి ఘనంగా తొలిపూజ
తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవికి తొలిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం సర్పంచ్ నిర్మల శ్రీశైల యాదవ్ మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో రాంపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, గ్రామ ప్రజల అభివృద్ధి కోసం అన్ని రంగాలలో ముందు ఉంటామని తెలియజేశారు. నవరాత్రుల తొమ్మిది రోజులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని హామీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.