చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 2, స్వాధిష్టానంలో సాధన - బ్రహ్మచారిణి తపస్సు (జ్ఞాన, దృఢ సంకల్పాల దేవత)
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 2
స్వాధిష్టానంలో సాధన - బ్రహ్మచారిణి తపస్సు (జ్ఞాన, దృఢ సంకల్పాల దేవత)
*************************************************************************
:బ్రహ్మచారిణి ధ్యాన శ్లోకం:
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండోరోజైన ఆశ్వీయుజ శుక్ల విదియ నాడు పూజిస్తారు. ‘బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.
:పాలక గ్రహం: అన్ని అదృష్టాలను అందించే కుజ (మంగళుడు) గ్రహం. బ్రహ్మచారిణి దేవి చేత పాలించబడుతుంది. బ్రహ్మచారిణి దేవిని ఆరాధన చేయుట వలన జాతకంలో కుజ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు భూసంబంధ, రుణములు, అనారోగ్యములు మొదలైనవి అధిగమించ గలరు.
:బ్రహ్మచారిణి ఇష్టమైన పువ్వు: మల్లెపూలు
:బ్రహ్మచారిణి మంత్రం: దేవ్యై బ్రహ్మచారిణ్యై నమః ।
బ్రహ్మచారిణీ అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది :బ్రహ్మ, అంటే అన్నీ తెలిసిన, తానే జగత్తుగా కలిగిన, స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్ధం వస్తుంది. చారిణి, అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం. కదలడం, ఒక పనిలో నిమగ్నమవడం, ఒక దానిని అనుసరించడం వంటి అర్ధాలు వస్తాయి. మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్ధిని. అలాగే పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. నారదుని ఉపదేశానుసారం ఘోరమైన తపస్సు చేసి విజయం సాధించింది. ఈమెకు ‘ఉమా’ ‘అపర్ణ’ అనే పేర్లున్నాయి.
ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీదేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. పార్వతీ దేవి యొక్క మరొక రూపమైన బ్రహ్మచారిణి, స్వాధిష్ఠాన చక్రంతో అనుసంధా నించబడినది. ఆమె స్వచ్ఛత, భక్తి మరియు పరివర్తన శక్తిని కలిగి ఉంటుంది. ఈ చక్రం భావోద్వేగాలు, సృజనాత్మకత మరియు లైంగికతను నియంత్రిస్తుంది మరియు బ్రహ్మచారిణి శక్తి ఈ శక్తులను శుద్ధి చేయడానికి మరియు నిర్మాణాత్మకంగా ప్రసారం చేయడానికి సహాయపడుతుంది.
:పురాణకధ:
పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా, హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అనిచెప్పినా, ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ, ఆయనకు సంతానం కలిగే అవకాశంలేదు అని, ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీ దేవిగా జన్మెత్తి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి, తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
బ్రహ్మచారిణి దేవి ఆలయములు ...
వారణాసిలో బ్రహ్మచారిణి దేవాలయం (దేశంలో ఇక్కడ మాత్రమే) ఉంది. హిందువుల ప్రముఖ పుణ్య క్షేత్ర మైన వారణాసిలోని దుర్గాఘాట్ దగ్గరే ఈ బ్రహ్మచారిణి దేవాలయం ఉంది. హిందూ పురాణాలను అనుసరించి బ్రహ్మచారిణీ పూజకు అత్యంత మహత్మ్యం ఉంది. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ బ్రహ్మచారిణిని పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెవరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేనివారికి వారి కోరిక తీరుతుందని చెబుతారు. ఇంతటి మహిమాన్వితమైన దేవతకు దేశంలో కేవలం ఒకే ఒక చోట దేవాలయం ఉంది.
ఈ ప్రాంతం హిందూ ధార్మిక కార్యక్రమాలకు ప్రముఖ నిలయం. హిందూ ధర్మం ప్రకారం ధార్మికంగా ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. పార్వతీ దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేస్తుంటుంది. అందులో భాగంగా మొదట కేవలం పళ్లు మాత్రమే తింటూ ఉంటుంది. అటు పై వాటిని కూడా వదిలి కేవలం నీటిని మాత్రం తాగి తపస్సు కొనసాగిస్తుంటుంది. ఆ రూపమే బ్రహ్మచారిణి అని పిలుస్తారు.
దుర్గాదేవిని ఈ బ్రహ్మచారిణి రూపంలో పూజించేవారికి సాక్షాత్తు పరమేశ్వరీ మాత ఆశిర్వాదం దొరుకుతుంది. రోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తులు కిలోమీటర్లమేర నిలుచొని ఉంటారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి కొబ్బరినీరును నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పూల దండలతో పాటు తెల్లని వస్త్రాలను కూడా కానుకగా అందజేస్తుంటారు, ముఖ్యంగా కీర్తి అనేక రెట్లు పెరుగుతుంది. అందుకే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కాశి నుంచి మాత్రమే కాకుండా దేశంలోని చాలా ప్రదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి రోజుల్లో ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సంతానభాగ్యం కోసం ఇక్కడ వేల మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం మొత్తం నల్లటి గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ దేవాలయం వాస్తుశైలి ద్రవిడ వాస్తు శైలిని పోలి ఉంటుంది.
బ్రహ్మచారిణి అమ్మవారి నైవేద్యం ...
నవరాత్రి ఉత్సవాలలో ప్రతి సంవత్సరం రెండవ రోజు శుక్లపక్షంలో దీన్ని జరుపుకుంటారు. అమ్మవారిని పూజిస్తారు. ప్రసాదంగా పంచదారను సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన కుటుంబంలో వారికి దీర్ఘాయువు కలుగుతుంది.
శ్రీ బ్రహ్మచారిణి స్తుతి ...
య దేవి సర్వభూతేషు మా బ్రహ్మచారిణీ రూపేణ సంస్థితా నమస్తస్మై
నమస్తస్మై నమస్తస్మై నమో నమః
::::::::::::::::::::::::::::::::::::::::::::::
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచీ అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబర్ 12 సోమవారం ఆశ్వీజ శుద్ధ విదియ "శ్రీ గాయత్రీ దేవి" గా రెండవ రోజు అలంకారము చేస్తారు.
అమ్మవారికి నైవేద్యము: రవ్వ కేసరి,పులిహార , దద్దోజనం
అమ్మవారి చీర అలంకారం: నారింజ రంగు
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భ్రమర రూపిణిగా భక్తులను కాచే శ్రీశైల భ్రమరాంబ
(అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది)
*********************************
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవక్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ....శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో అనుక్షణం ఆధ్యాత్మికత తో మారుమ్రోగుతుంటుంది.
శ్రీశైలం గొప్ప ప్రాచీన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అనేక యుగాల నుండి శ్రీ భ్రమరాంబికా దేవి-మల్లికార్జున స్వామి నివసించే శ్రీశైలం వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులకు పూజనీయ ప్రదేశంగా ఉంది. శివుడు పన్నెండు క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరోశక్తి పీఠం, ఈ రెండు కలగలిసిన దివ్య క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంబుగా వెలిశారు. శివుడు మరియు శక్తీ ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరు గాంచింది. శ్రీశైల క్షేత్రంలో ఏ కొద్దిపాటి పుణ్యకార్యం చేసిన వెయ్యి రెట్ల ఫలితం లభిస్తుంది, ఎందుకంటే అది ఒక మహాజ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం తో కొలువై స్వయంభూ క్షేత్రం కాబట్టి, శ్రీశైల క్షేత్రంలో ప్రవహించే శక్తి అనంతం.
స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం ప్రకారం భ్రమరాంబ దేవి, పార్వతీ దేవి దివ్య మూల రూపం. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవిని ఉపాసన చేసాడు. అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు, గాయత్రీ దేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని, బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది. ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు 'ఓం బ్రహ్మదేవాయ నమః' అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరాయి. కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు. అరుణాసురుడు కోరిక చాలా త్రీవమైనకోరిక అనీ, దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడుని అభ్యర్థిస్తారు. బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు. అతని కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మ దేవుడు అలాంటి కోరిక విశ్వ సూత్రాలకు విరుద్ధమని, దానికి బదులుగా ఏదైనా మరొక కోరికను అభ్యర్థించమని కోరతాడు. అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత 2 కాళ్ల లేదా 4 కాళ్ల జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు. తనను తాను అమరుడిగా, అజేయంగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఆ సందర్బంలో దేవతలను కూడా విడిచిపెట్టడు. అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు, పార్వతితో పంచుకుంటారు.వరం పొందిన తరువాత, అరుణాసురుడు దేవతలు, సాధువులకు సమస్యలను కలిగించడం ప్రారంభించాడు. అతని అపారమైన శక్తి కారణంగా, దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు. వారి అభ్యర్థనకు సమాధానంగా, దుర్గా దేవి భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. రాక్షసుడిని చంపటానికి అతను పొందిన వరానికి భిన్నంగా వేల ఆరు కాళ్ల తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడుపైకి వదిలింది. తేనెటీగల దాడికి అరుణాసర రాక్షసుడు మరణిస్తాడు.ఆతర్వాతఅమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనుదిరిగింది.
భ్రమరాంబికా దేవి వృత్తాంతం
సతీదేవి అతి ముఖ్యమైన పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబిక దేవిగా కొలువై ఉంటుంది. శ్రీశైలఖండంలోని 23వ అధ్యాయం శ్రీ భ్రమరాంబిక దేవి ప్రాముఖ్యత, చరిత్రను వివరిస్తుంది. భ్రమరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెపుతాడు. పార్వతీ నీ మహిమవలన అష్టాదశ శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే శరీర భాగాలన్నింటిలో గొంతు ఎంత ముఖ్యమో, అష్టాదశ శక్తి పీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది. దేవీ శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది. ఈ మహాపీఠంలో, శ్రీశైలంలో నా పక్కనే, భ్రమరాంబికగా దేవతలందరూ నిన్ను సేవిస్తున్నారు. ఆ విధంగా భ్రమరాంబికా దేవి రూపంలో మూడు లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వరాలను ఇచ్చే అనేక దేవుళ్ళలో శ్రీ భ్రమరాంబిక దేవి లాంటి వారు ఎవరూ లేరు. ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా మందిరూపంలో దేవతా అవతారాలను అలంకరించింది. భ్రమరాంబిక దేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు, విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు, కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది. భ్రమరాంబిక దేవత అనారోగ్యాలను, అకాల మరణాలను నాశనం చేస్తుంది. శుభాలు, అదృష్టం, ఆనందాన్ని ఇస్తుంది.భ్రమరాంబిక దేవి భయాందోళనలను, శత్రువులను నాశనం చేస్తుంది.భక్తులు కోరుకున్నదంతా ప్రసాదిస్తుంది. ఆకర్షణ శక్తిని వరిస్తుంది. అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది.ఈ విధంగా భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా ఆలయానికి పడమర దిక్కున నివసిస్తుంది.
శక్తి పీఠం
శివుని పట్ల ద్వేషంతో శివుడులేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు, కానీ సొంత అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞ్యానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పంపి దక్షయజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు తదనంతరం సతి దేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి. ఇది గమనించిన శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతి దేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలన్నిశక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతి దేవి శరీరంలోని మెడ భాగము భ్రమరాంబిక దేవి విగ్రహం లో కలిసిపోయి 6 వ శక్తి పీఠంగా ప్రసిద్ధి గాంచింది.
*********-----************
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com