తైవాన్‌తో దౌత్య సంబంధాలు..పరాగ్వే, బెలిజ్ మంత్రులపై చైనా కఠిన ఆంక్షలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలపై చైనా ప్రభుత్వం ప్రతీకార చర్యలను తీవ్రతరం చేసింది. తైవాన్ ప్రాంతానికి మద్దతు ఇస్తూ తమ జాతీయ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నారనే నెపంతో పరాగ్వే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి గుస్తావో విల్లాటే సస్టేనిగో, అలాగే బెలిజ్ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్ ఫోన్సెకాలపై కఠినమైన నిరోధక ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
చైనా చట్టాల ప్రకారం విధించిన ఈ ఆంక్షల ప్రకారం సదరు మంత్రులకు చైనా, హాంకాంగ్, మెకావు ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి వీసాలను రద్దు చేయడంతో పాటు ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే చైనా భూభాగంలో వారి పేరిట ఉన్న స్థిర, చర ఆస్తులను పూర్తిగా జప్తు చేయాలని ఆదేశించారు. దీనితో పాటు చైనాకు చెందిన ఏ ఏజెన్సీలు, వ్యాపార సంస్థలు లేదా వ్యక్తులు కూడా ఈ మంత్రులతో ఎలాంటి వ్యాపార, సహకార లావాదేవీలు జరపకూడదని విదేశాంగ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్‌ను తమ భూభాగంలో భాగంగా పరిగణించే చైనా, 'వన్ చైనా' విధానాన్ని ధిక్కరించే దేశాలపై దౌత్యపరమైన ఒత్తిళ్లను పెంచుతోంది. పరాగ్వే, బెలిజ్ రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తైవాన్‌కు అనుకూలంగా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే చైనా ఆంక్షలపై తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, తమ మిత్రదేశాల సార్వభౌమాధికారంలో చైనా జోక్యం చేసుకోవడాన్ని ఖండించింది. చైనా బెదిరింపులకు లొంగకుండా అంతర్జాతీయంగా స్నేహపూర్వక దౌత్య బంధాలను కొనసాగిస్తామని తైవాన్ పునరుద్ఘాటించింది.