BREAKING
నిరుపేద కుటుంబానికి కొండంత అండగా మంత్రి పొంగులేటి! జావా ప్రోగ్రామింగ్ భాషలో తీవ్ర భద్రతా లోపాలు తొలి లఘుచిత్రంతోనే ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేసిన శ్రీజ సాదినేని.. ఉత్తమ దర్శకురాలిగా ఘనత! శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా.. ఉపాధ్యాయురాలి మెడలో బంగారు గొలుసు చోరీ ఎలి లిల్లీ మార్కెట్ విలువ..పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అంచనాలు మరియు ఆందోళనలు మహేష్.. బాగా ముదిరిపోయాక నా దగ్గరికి రా.. ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ ఫన్నీ కామెంట్స్! వాషింగ్టన్, బీజింగ్ మధ్య వాణిజ్య ఒప్పందానికి తీవ్ర ముప్పు నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 440 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్ తమిళ చిత్ర పరిశ్రమలోకి రౌడీ హీరో తమ్ముడి గ్రాండ్ ఎంట్రీ.. జై జై గణేశాగా వస్తోన్న ఆనంద్ దేవరకొండ! యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రెస్ విజయవంతమైన అరంగేట్రం చైనాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు కెనడా సన్నాహాలు పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చేసింది.. ఈషా రెబ్బా నా కొడుకు లైఫ్ పార్ట్‌నర్ అన్నంత పనిచేసిన తరుణ్ మదర్! ఆస్ట్రేలియా కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ కోతలు

చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని)

Select Suryaa Now
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని)

చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1

మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి  ఆరాధన               

 (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని)

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

:శైలపుత్రీ దుర్గా ప్రార్థన శ్లోకం:

వందే వాంఛిత లాభాయచంద్రార్ధకృత శేఖరాం, 

వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్

"వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, కీర్తి కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా నమస్కారం అర్పిస్తున్నాను”. అని ఆ శ్లోకానికి అర్ధం.

 

భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవదుర్గలలో ప్రధమ రూపమైన ఈ దేవిని పూజిం చడం వలన విశేష ఫలితాలు కలగడం తో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయి.

:పాలక గ్రహం: – చంద్రుడు అన్ని అదృష్టాలను అందించే చంద్రుడు శైల పుత్రి దేవిచే పరిపాలించబడుతుందని మరియు ఆది శక్తి యొక్క ఈ రూపాన్ని ఆరాధించడం ద్వారా చంద్రుని యొక్క ఏదైనా చెడు ప్రభావాన్నిఅధిగమించగలము.

:శైలపుత్రి ఇష్టమైన పువ్వు:  - జాస్మిన్, మల్లెపూలు

:శైలపుత్రి మంత్రం: -  దేవ్యై శైలపుత్ర్యై నమః॥

 

అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం  శైలపుత్రి. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రీ దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు.

 

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

 

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రీ దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. శైలపుత్రి మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంది మరియు ఆమె భక్తులకు ఆధ్యాత్మిక వృద్ధి, స్థిరత్వం మరియు శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. మూలాధార చక్రం ఇది శరీరంలోని ఏడు ప్రధాన శక్తి కేంద్రాలలో మొదటిది. ఇది వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది మరియు మనుగడ, భద్రత మరియు ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. శైలపుత్రి దేవి భూమి తత్త్వాన్ని సూచిస్తుంది మరియు మూలాధార చక్రానికి అనుసంధానించబడి ఉంది. ఆమె మూలాధార చక్రం యొక్క శక్తిని మేల్కొల్పడానికి సహాయపడుతుంది, ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాదిగా పనిచేస్తుంది. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. సత్ చిత్ ఆనంద అనేది హిందూ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన. ఇది మూడు పదాల కలయిక: సత్ అంటే 'ఉనికి', చిత్ అంటే 'చేతన', మరియు ఆనంద అంటే 'ఆనందం'. కాబట్టి, సత్ చిత్ ఆనంద అంటే 'ఉనికి యొక్క ఆనందకరమైన స్పృహ'. ఇది వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం, ఇక్కడ వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గుర్తిస్తాడు మరియు ఆనందం మరియు శాంతి యొక్క శాశ్వతమైన స్థితిని అనుభవిస్తాడు. ఇది ఆధ్యాత్మికత ద్వారా సాధించబడుతుంది.

ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా  తనలొ ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రీదేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

:పురాణకధ:

నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతీ, హైమవతీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీ దుర్గా దేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి  వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి, శివుణ్ణీ, సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దనీ, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. సతీదేవిగా ఆత్మాహుతి చేసుకున్న తర్వాత, పార్వతి దేవి హిమాలయ ప్రభువు కుమార్తెగా జన్మించింది . సంస్కృతంలో శైల అంటే పర్వతం అని అర్థం, అందుకే దేవతను పర్వత కుమార్తె అయిన శైలపుత్రి అని పిలుస్తారు. ఈమెనే హైమవతీ, శైలజ,  అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. 

శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతరన పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి... నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుడు) నుంచి భర్త(శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి.

పరాశక్తి అవతారం… తొమ్మిది రూపాలలో ఆమెకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా, శైలపుత్రి దేవిని నవరాత్రి మొదటి రోజున పూజిస్తారు. సతీదేవిగా ఆమె మునుపటి జన్మ మాదిరిగానే, శైలపుత్రి దేవి శివుడిని వివాహం చేసుకుంది.

శైలపుత్రీ దుర్గాదేవి ఆలయాలు...

ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హియాఘాట్ వద్ద శైలపుత్రీ దేవిఆలయం ఉంది. వారణాసిలోని  శైలపుత్రి ఆలయం దాని ఆధ్యాత్మిక బలానికి మరియు సందర్శించే వారందరికీ అందించే సానుకూల శక్తికి ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఆశీస్సులు కోరుకోవడానికే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అంతర్గత శాంతిని పొందడానికి కూడా ఇక్కడికి వస్తారు. అన్ని అడ్డంకులను తొలగించే ఆశీర్వాదం ఇచ్చే మా శైలపుత్రి దైవఉనికిని ఆమె అనుగ్రహాన్ని కోరుకునే వారు అనుభూతి చెందుతారు.

శైలపుత్రి అమ్మవారి నైవేద్యం… 

నవరాత్రులలో మొదటిరోజు శైలపుత్రి అమ్మవారి రూపానిది. ప్రతి సంవత్సరం ప్రతిపాద శుక్లపక్షంలో దీన్ని జరుపుకుంటారు. అమ్మవారికి స్వచ్చమైన నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. నేతిని అమ్మవారి పాదాలపై పోసి అభిషేకిస్తారు. ఇలా చేయటం వలన మీకున్న సకల రోగాలు, కష్టాలు తొలగిపోతాయి.

నవదుర్గలలో ప్రతిరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, లక్షణాలున్నాయి. నవదుర్గలను ప్రసన్నం చేసుకోడానికి, భక్తులు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక పదార్థం నైవేద్యంగా పెట్టాలి.వారు ప్రతిరూపంలో ఒక్కో ప్రత్యేక రంగు, ఆహరం, పువ్వులు ఇష్టపడతారు.

శైలపుత్రి స్తుతి…

యాదేవి సర్వభూ తేషు శైలపుత్రీ రూపేణ సంస్థితా నమస్తస్మై

నమస్తస్మై నమస్తస్మై నమో నమః

::::::::::::::::::::::::::::::::::::::::::::::

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా  అక్టోబర్11 నుంచీ  అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబర్ 11 ఆదివారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి “శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి” గా మొదటిరోజు అలంకారము చేస్తారు. 

అమ్మవారి నైవేద్యము: తీపి బూంది, సెనగలు లేదా పెసరపప్పు పాయసము

అమ్మవారి అలంకరించే చీర: ఆరెంజ్ లేదా లేత గులాబీరంగు  చీర

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

పంచారామ క్షేత్రాన వెలిగే చల్లని తల్లి - ద్రాక్షారామ మాణిక్యాంబ (అష్టాదశ శక్తి పిఠాల్లో 12వది)

***************************************************************************************

ప్రసిద్ధ చారిత్రాత్మక దేవాలయాలలో ద్రాక్షారామం దేవాలయం ఒకటి, దక్షారామం (ద్రాక్షారామంగా ప్రసిద్ధి చెందింది) దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఉంది, ఇది  “పద్యనిమిది శక్తి పీఠాలలో ఒకటి" ఈ ఆలయం వాటిలో "12వ శక్తి పీఠం", మరియ "దక్షిణ కాశీ" అంటారు. దేవుని పేరు భీమేశ్వరుడు మరియు శక్తి పీఠం అమ్మవారు "మాణిక్యాంబ అమ్మవారు". స్వయంభు శివాలయం. ఇది పంచారామాలలో ఒకటి, త్రిలింగాలలో ఒక ప్రత్యేకమైనది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరో పేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు   స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం. ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

భీమ కవి ఈ భీమేశ్వర మాణిక్యాంబలను సేవించి, అక్షర శక్తిని సంపాదించాడు.

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించారు. ఊరి మధ్యన గల ఈ ఆలయం 3 ప్రాకారాలతో, 4 గాలిగోపురాలతో శివభక్తితో ధీటుగా నిలచింది. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. త్రిలింగ దేశం అనేది తెలింగ, తెలుగు, అనే పదానికి మూలం. త్రిలింగ దేశం అనేది  మూడు గొప్ప శివలింగాలు, కాళేశ్వరం, శ్రీ శైల - మల్లికార్జున మరియు భీమేశ్వరుడు ఉన్న భూమి. ఈ మూడు శివాలయాలు బహుశా తెలుగు భూమిలోని దేవాలయాలలో అత్యంత పురాతనమైనవి.

ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం. 

జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఈ శక్తి స్వరూపిణి మాణిక్యాంబాలయం, స్వయంభూ భీమేశ్వరాలయం యొక్క విశిష్ఠత చేరి కొలవవలెనే గాని చెప్పనలవికాదు.

:స్థల పురాణం: 

సతీదేవి ఖండితాంగాలలో ఎడమ బుగ్గ పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. సంస్కృతంలో దక్షరామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అని అర్థం. ఆయన సతి తండ్రి మరియు శివుని మామ. స్థల పురాణం శ్రీ వేద వ్యాసుని స్కంద పురాణంలో చూడవచ్చు. ఈ పవిత్ర స్థలంతో సంబంధం ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి. వీరభద్రుడు దక్షుని శిరచ్ఛేదం చేసినప్పుడు, అతని తల ఈ ప్రదేశంలో పడిపోయింది. దక్ష ప్రజాపతి ఒకసారి నీరీశ్వర యాగంకు సతి ఆహ్వానించ బడకపోయినా, తన భర్త శివుడి సలహాను పట్టించుకోకుండా యజ్ఞానికి హాజరైంది. తల్లిదండ్రుల అవమానాన్ని భరించలేక, ఆమె యజ్ఞ స్థలంలో తనను తాను ఆత్మాహుతి చేసుకుంది. దక్షుడికి ఆదర్శప్రాయమైన శిక్ష విధించడమే లక్ష్యంగా ఉన్న ఉగ్ర యోధుడు వీరభద్రుడిని శివుడు పుట్టించాడు. దక్షుడిని ఓడించి, మేక తలతో జీవించడానికి పునరుద్ధరించిన తర్వాత, శివుడు సతి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవాన్ని ప్రారంభించాడు. దానిని ఆపడానికి, శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 51 భాగాలుగా ఖండిస్తే 51 శక్తి పీఠాలుగా మారాయి. అందులో 18 ప్రధాన ప్రదేశాలు మరియు వాటిని "అష్టాదశ శక్తి పీఠాలు" అని పిలుస్తారు. సతి ఎడమబుగ్గ దక్షారామం వద్ద పడి 12వశక్తి పీఠం గా మారింది.

:పంచారామం:

తారకాసురుడు అత్యంత తీవ్రమైన తపస్సు చేసి, శివుడి నుండి ఆత్మలింగాన్ని వరంలా పొందాడు.  తారకాసురుడు దేవతలపై దారుణాలకు పాల్పడ్డాడు. దేవతలు పార్వతి దేవితో తారకాసురుడిని అంతం చేయమని వేడుకున్నారు. పార్వతి దేవి తన కుమారుడు షణ్ముఖుడు ద్వారా తారకాసురుడిని చంపింది. తారకాసురుడి గొంతులోని ఆత్మలింగాన్ని నాశనం చేసి, ఆ రాక్షసుడిని చంపమని శివుడు షణ్ముఖుడికి ఆదేశించాడు. ఆత్మలింగం ఐదు ముక్కలుగా విరిగి ఐదు ప్రదేశాలలో పడిపోయింది. సప్తర్షులు దక్షరామంలో పడిపోయిన ఐదవ భాగాన్ని భీమనాథేశ్వరుడిగా ప్రతిష్టించారు. వారి ప్రార్థన మేరకు, గోదావరి నది ఈ ప్రదేశానికి ప్రవహించింది. అనేక అడ్డంకులు ఆ పనిని ఆలస్యం చేశాయి. వారు ఆలయానికి చేరుకున్నప్పుడు, ఋషులు నిర్ణయించిన అసలు ముహూర్తంలోనే భీమనాథేశ్వరుడు స్వయంభువుగా అవతరించాడని చూసి వారు ఆశ్చర్యపోయారు. సప్తర్షులు గోదావరి నదిని ఇక్కడికి తీసుకువచ్చారు కాబట్టి, దీనిని సప్త గోదావరి అని పిలుస్తారు. ఈ కథ భాగవతం, గౌతమీ మహత్యం, సప్త సాగర్ మహత్యం, శ్రీ వేద వ్యాసుని భీమ ఖండం మొదలైన వాటిలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు శివలింగ స్థాపనలో పాల్గొన్నారని సంరక్షకునిగా నిలుస్తున్నారని చెబుతారు. శ్రీ వేదవ్యాసుడు వారణాసిలోకి ప్రవేశించకుండా నిషేధించబడినప్పుడు, ఆయన ఓదార్పు కోసం "దక్షిణ కాశి" అని పిలువబడే దక్షారామానికి వచ్చాడు. శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీ మాణిక్యేశ్వరిని “మేరు ప్రస్థారా శ్రీ చక్ర బిందు” పై స్థాపించారు. అందుకే, శ్రీ చక్రం మరియు అమ్మవారికి ఏకకాలంలో పూజలు నిర్వహిస్తారు. ఇది ఇక్కడ మాత్రమే జరుగుతుంది, కానీ మరే ఇతర అష్టాదశ శక్తి పీఠాలలో జరగదు.

*********-----************

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com