ప్రేమ పేరుతో వంచన.. పెళ్లికి నిరాకరించిన ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
సూర్య తెలంగాణ డెస్క్: ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను నమ్మించి మోసం చేసిన ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నల్గొండకు చెందిన ఓ మహిళా (40) కుటుంబం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలనీలో నివాసముంటోంది. 2016లో విధి నిర్వహణలో భాగంగా చాంద్రాయణగుట్ట ఠాణా అడ్మిన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న బాలస్వామిని ఆమె కలిశారు. అప్పటి నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటూ దగ్గరైన ఆయన, 2017 జనవరిలో ఆమెకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
అప్పట్లో ఆమె భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, భర్త ఎక్కువ కాలం బతకడని వైద్యులు చెప్పడంతో ఆమె అంగీకరించింది. తనకు అప్పటికే పెళ్లి జరిగిందని, విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని భరోసా కల్పించిన ఆయన, 2021లో ఆమె భర్త మరణించిన తర్వాత కూడా మోసగిస్తూ వచ్చాడు. అయితే కొద్దికాలం కిందట అతనికి ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కొత్త ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నాడని తెలుసుకున్న బాధితురాలు అతన్ని నిలదీసింది. అతని ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.