రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
- బహదూర్గూడ భూ సమస్యలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌దే బాధ్యత
- బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్ నియోజకవర్గ జీహెచ్ఎంసీ శంషాబాద్ బహదూర్గూడ, కొత్వాల్‌గూడ, ఘ్యామియగూడ, సుల్తాన్‌పల్లి గ్రామాల భూ సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విఫలమయ్యారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినా రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
బుధవారం శంషాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో బహదూర్గూడలో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి రైతులకు భరోసా కల్పించారని తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన రైతులను రైతులే కాదంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
రైతుల భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం కల్పించి, హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రైతులకు పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తూ, సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ : శంషాబాద్