పట్టణంలో400 మీటర్ల రన్నింగ్ ట్రాక్
చీపురుపల్లి మేజర్ న్యూస్ : స్థానిక పట్టణ పరిధిలో నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. పట్టణ శివారులోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన క్రీడ మైదానాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నివీర్, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019లో మంజూరైన స్టేడియం పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. చీపురుపల్లి రక్షణ రంగ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం సరైన 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 400 మీటర్ల ట్రాక్ అవసరాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, చీపురుపల్లిలో ట్రాక్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్న యువతకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, స్టేడియం నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని రామ్ మల్లిక్ నాయుడు తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గ యువతకు క్రీడలు, ఉద్యోగ శిక్షణతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.