క్రమశిక్షణే విద్యార్థి విజయానికి తొలిమెట్టు * విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
భోగాపురం, అక్టోబర్ 1,(మేజర్ న్యూస్)
విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, నాణ్యమైన విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విద్యతో పాటు మంచి విలువలు అలవర్చుకున్నప్పుడే యువత ఉన్నత శిఖరాలను అధిరోహించగలదని పేర్కొన్నారు. గురువారం రావాడ అవంతి రీసెర్చ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అప్పలనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే కీలక దశ అని అన్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లే సమయంలో విద్యార్థులు కేవలం సరదాలు, స్నేహానుభూతులను మాత్రమే కాకుండా, విలువైన విద్యా జ్ఞానాన్ని తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే లోకం నాగమాధవి విద్యార్థులను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ చంద్రభూషణరావు, కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ ప్రియాంక దసరా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.