ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలనీ మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి సూచించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు మంగళవారం మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ సర్పంచులకు సామర్థ్యాభివృద్ధి (కెపాసిటీ బిల్డింగ్), ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం, అభివృద్ధి పనుల పురోగతి నివేదికలు, గణాంకాలు, పెండింగ్ అంశాలు, అవసరమైన రికార్డులను అధికారులు సమావేశంలో చదివి వినిపించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టడం, పెండింగ్ పనులను పూర్తి చేయడం వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కోరారు. ఈ తహసీల్దార్ నెలపట్ల నరేష్,మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం,మండల పంచాయతీ అధికారి కేదారీనాథ్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.