హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా!
హిరమండలం సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్: హిరమండలం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. మండలంలోని మొత్తం 58 ప్రభుత్వ పాఠశాలలకు గాను 55 పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సంబంధిత సభ్యుల భాగస్వామ్యంతో ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. అయితే, నిబంధనల ప్రకారం కావలసిన కోరం పూర్తికాకపోవడంతో జిహెచ్‌ఎస్ హిరమండలం, జడ్పీహెచ్‌ఎస్ అవలంగి, ఎం.పి.పి.ఎస్ రుగడ అనే 3 పాఠశాలల్లో SMC ఎన్నికలను అధికారులు నిర్వహించలేక వాయిదా వేశారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం మరియు పాఠశాల అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో SMC కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటూ, వాయిదా పడిన 3 పాఠశాలల్లో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.