టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా
సూర్య టెక్నాలజీ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో మైనర్లు, టీనేజర్ల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యుక్తవయస్కులైన యూజర్ల కోసం ప్రత్యేకంగా సరికొత్త ‘ఐచ్ఛిక పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టీనేజర్లు వాట్సాప్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించేలా తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.
తల్లిదండ్రుల నియంత్రణలో ఉండే కీలక అంశాలుప్రైవసీ సెట్టింగ్స్ నిర్వహణ: టీనేజర్ల ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్, స్టేటస్ అప్‌డేట్స్‌ను ఎవరు చూడవచ్చో తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. పిల్లలు ఈ సెట్టింగ్స్‌ను మార్చాలంటే తల్లిదండ్రులు సెట్ చేసిన పిన్ అనుమతి తప్పనిసరి. గ్రూప్స్ & కాంటాక్ట్స్ నిఘా: గుర్తుతెలియని వ్యక్తులు తమ పిల్లలను గ్రూపుల్లో చేర్చకుండా పరిమితులు విధించవచ్చు.
అలాగే టీనేజర్లు కొత్త గ్రూపుల్లో చేరినా లేదా గ్రూప్ సైజు గణనీయంగా పెరిగినా తల్లిదండ్రులకు అలర్ట్ అందుతుంది.మెటా ఏఐ కంటెంట్ ఫిల్టర్లు: వాట్సాప్‌లోని అంతర్నిర్మిత ఏఐ అసిస్టెంట్ వినియోగంపై కూడా పరిమితులు పెట్టవచ్చు. టీనేజర్ల వయస్సుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా 'లిమిటెడ్ కంటెంట్' మోడ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యథాతథంఈ కొత్త పేరెంటల్ ఫీచర్లపై వాట్సాప్ ఒక ముఖ్యమైన స్పష్టతనిచ్చింది. తల్లిదండ్రులు సెట్టింగ్స్‌ను పర్యవేక్షించగలిగినప్పటికీ, టీనేజర్ల వ్యక్తిగత చాట్‌లు లేదా కాల్స్ వినడం, చదవడం సాధ్యం కాదు. పూర్తి గోప్యత: వ్యక్తిగత సంభాషణలు ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడి ఉంటాయి.
స్వచ్ఛందం : ఈ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికం. తల్లిదండ్రులు తమ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా దీనిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 'టీన్ అకౌంట్స్' పేరుతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న మెటా, ఇప్పుడు వాట్సాప్‌లోనూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా రక్షణ చర్యలను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది