ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ
వీరవాసరం, మేజర్ న్యూస్: ఆరోగ్యవంతమైన పౌరులతోనే బలమైన కుటుంబం, అభివృద్ధి చెందిన దేశం సాధ్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన ‘సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీరవాసరం మండలం పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో కలిసి ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులతో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే ఆప్యాయంగా ముచ్చటించారు. పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారుల సంరక్షణ, పోషణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను సత్కరించారు.
కేంద్రం నిర్వహణ, పిల్లల చురుకుదనంపై శ్రీనివాస వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు కలిపి 25 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రజా సేవకు అంకితమయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్లే వరకు వారి ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. అంగన్‌వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై తల్లులకు అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు.నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఈ పథకాలపై అవగాహన కల్పించి అర్హులైన వారిని నమోదు చేయించాలని కోరారు.గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, లీలా కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.