దొంగల ముఠా అరెస్ట్.. 8 తులాల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం
తాండూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులు
తాండూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29): వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను తాండూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 8 తులాల బంగారం, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.తాండూర్ పట్టణంలోని గాంధీనగర్‌లో ఈ నెల 13న జరిగిన చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం తాండూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు గండీడ్ మండలం లింగంపల్లికి చెందిన ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ అడుల బాబు, యాలాల మండలం కమాల్‌పూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ బోయిని శ్రీకాంత్, తాండూర్ మార్కండేయ కాలనీకి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కె.ప్రవీణ్‌గా గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో జైలులో పరిచయమైన ఏ-1, ఏ-2లు జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏ-3తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం తాండూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. రాజీవ్ కాలనీ, గాంధీనగర్, మిత్రనగర్ ప్రాంతాల్లో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.నిందితుల నుంచి చోరీ సొత్తుగా 8 తులాల బంగారం, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, యాలాల ఎస్‌ఐ విఠల్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.