విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు
ఎస్ఎంఎస్-1లో ల్యాడిల్ స్లైడ్ గేట్ సాంకేతిక లోపం
సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఊపిరి పీల్చుకున్న కార్మికులు, యాజమాన్యం
గాజువాక, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోమారు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్-1 పరిధిలోని నిరంతర కాస్టింగ్ (సీసీడీ) విభాగంలో మంగళవారం చోటుచేసుకున్న సాంకేతిక లోపం తీవ్ర కలకలం రేపింది. వేడి ఉక్కు ద్రవాన్ని తరలిస్తున్న భారీ ల్యాడిల్ స్లైడ్ గేట్ మెకానిజంలో సమస్య తలెత్తి సక్రమంగా మూతపడకపోవడంతో, అధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కు ఒక్కసారిగా నేలపాలైంది. అయితే ఆ సమయంలో సమీపంలో కార్మికులెవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయాలు కానీ కాకపోవడంతో అటు యాజమాన్యం, ఇటు కార్మిక వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే ఎస్ఎంఎస్-1 విభాగంలో ల్యాడిల్ సంబంధిత ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన ఘటనను కర్మాగార వర్గాలు ఇంకా మరచిపోలేదు. ఆ చేదు జ్ఞాపకాలు కళ్లముందే కదలాడుతుండగానే, మళ్లీ సరిగ్గా అదే విభాగంలో ల్యాడిల్ గేట్ పనిచేయక ద్రవ ఉక్కు నేలపాలు కావడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు.
తాజా ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, వరుస ఘటనలు కార్మికుల్లో తీవ్ర అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. నిరంతరం వేలాది డిగ్రీల సెల్సియస్ వేడి వద్ద పనిచేసే సున్నితమైన యంత్రాలు, ల్యాడిల్ స్లైడ్ గేట్లు, హైడ్రాలిక్ మూవ్‌మెంట్ వ్యవస్థల నిర్వహణ, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ప్లాంట్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల రక్షణను దృష్టిలో ఉంచుకుని, అన్ని ల్యాడిల్స్, అనుబంధ యంత్రాల భద్రతపై సమగ్ర సాంకేతిక తనిఖీలు చేపట్టాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.