పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం
- 650 మందికి శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ
- ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా అందజేత
సింధియా, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : పేదలను సంపూర్ణ యాజమాన్య హక్కుదారులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికే దక్కిందని ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. మంగళవారం పారిశ్రామిక ప్రాంతంలో పలుచోట్ల నిర్వహించిన ''పేదలకు పట్టాభిషేకం – బాబు హామీ మీ చేతికే మీ భూమి'' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా 58,59 వార్డుల పరిధిలోని హిమాచల్ నగర్, నక్కవాణిపాలెం, ఏదురువాణిపాలెం ప్రాంతాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా 650 మంది లబ్దిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆస్తిపత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం ఉపాధి కోసం కొండవాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో గూడు కట్టుకుని తాతలు, తండ్రుల కాలం నుంచి భయం భయంగా బతికిన పేద కుటుంబాలకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శాశ్వత రక్షణ, భరోసా దక్కిందని అన్నారు. గతంలో ఇచ్చిన నామమాత్రపు డి-ఫామ్ పట్టాల మాదిరిగా కాకుండా, కూటమి ప్రభుత్వం పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ రాజముద్రతో కూడిన పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందిస్తోందని స్పష్టం చేశారు. నగరంలో భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో, ఆ పెరిగిన సంపద కేవలం ధనికులకే కాకుండా పేదలకు కూడా దక్కాలన్న మహోన్నత ఆశయంతో వేల కోట్ల విలువైన ఆస్తులను పేదల పరం చేశామని పేర్కొన్నారు. ఈ అధికారిక ఆస్తి పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి చట్టబద్ధంగా రుణాలు పొంది పిల్లల ఉన్నత చదువులకు, శుభకార్యాలకు, కుటుంబ ఆర్థిక పురోగతికి వినియోగించుకోవచ్చని, ఇవి భావితరాల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తాయని ఆయన వివరించారు. పేదలకు పట్టాభిషేకం చేయటంలో కొన్ని నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించి వేలాది డాక్యుమెంట్లను సిద్ధం చేసిన ములగాడ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోల సేవలను గణబాబు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శీరం ఉమామహేశ్వరి, గల్లా చిన్న, 58వ వార్డు అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, పారిశ్రామిక ప్రాంత కూటమి పార్టీల కో ఆర్డినేటర్ విశ్వనాధుల దినకర్, రెవెన్యూ అధికారులు, పలువురు కూటమి పార్టీల నేతలు, మహిళలు పాల్గొన్నారు.