తీరొక్క పూల పరిమళాలు .. చిన్నారుల ఆటపాటలు
కృష్ణ సూర్య న్యూస్ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ రూపమైన బతుకమ్మ సంబరాలు మండలంలోని ముడుమాల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల పూల పరిమళాలు, విద్యార్థినుల కోలాటాల నడుమ సంస్కృతీ వైభవంతో శోభిల్లింది.
విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, తమ ఇళ్ల వద్ద రకరకాల పూలతో ముచ్చటగా పేర్చిన బతుకమ్మలను పాఠశాలకు తీసుకొచ్చారు. ఆనంతరం ఆవరణలో బతుకమ్మలను అమర్చి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు ఒకరిచేతులు ఒకరు పట్టుకుని బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు. పట్టువస్త్రాలు ధరించి చలాకీగా ఆడిపాడిన చిన్నారుల ఉత్సాహం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్ మాట్లాడుతూ—మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియపరుస్తూ,మన పండుగలను , విశిష్టతను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో ఐకమత్యాన్ని, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని, ప్రాముఖ్యత ను విద్యార్థులకు వివరించారు.
ఆనంతరం చిన్నారులతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు బృందం ఆడి పాడి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఢీ శేఖర్,ఉపాధ్యాయులు భారతి, రవికుమార్, పద్మావతమ్మ, మహేశ్వరి, రేణుక, మహితతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నర్సిములు , సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం