దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఇళ్ల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
దసరా పండుగ, విద్యాసంస్థల సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు వెళ్లే సమయంలో ఇళ్ల భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, పిల్లల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఇంటి భద్రతపై అప్రమత్తత అవసరం
ఊళ్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసివేయాలని, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా వెల్లడించకూడదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని స్పష్టం చేశారు.
పిల్లల విషయంలో జాగ్రత్త
రద్దీ ప్రదేశాల్లో పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదని, ప్రయాణాల సమయంలో వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. పోలీసులకు సహకరిస్తూ దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా విజ్ఞప్తి చేశారు.