బుచ్చి సి హెచ్ సి కి 39 లక్షల వైద్య పరికరాలు అందజేత
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు శుక్రవారం సుమారు 39 లక్షల విలువైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అందజేశారు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ,కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ తరపున వీటిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని, ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు సహకరించిన ఐ ఆర్ ఈ డి ఏ కు కృతజ్ఞతలు తెలిపారు. అందజేసిన వైద్య పరికరాల్లో రెండు బాయిల్స్ ఆపరేటస్ లు, ఒక డెలివరీ టేబుల్, మూడు ఈసీజీ మిషన్లు, ఐదు ఎపిసయోటమి సిజర్లు, ఒక హాట్ ఎయిర్ ఓవెన్, రెండు ఓటి షాడో లైట్ డబల్ డోమ్ లు, రెండు ఓటీ షాడో లైట్ సింగిల్ డోమ్ లు, 8 పేషంట్ బెడ్లు, రెండు ఫోటో థెరపీ ఎల్ఈడి యూనిట్లు, ఒక థైరాయిడ్ టెస్టింగ్ మిషన్, ఒక అల్ట్రాసౌండ్ మిషన్, మూడు వీల్ చైర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 12 లక్షల రూపాయల విలువైన అల్ట్రాసౌండ్ మిషన్, 1.50 లక్షల విలువైన థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ ఉన్నాయి. వీటితోపాటు 25 ఆఫీస్ చైర్లు, 5 కంప్యూటర్ టేబుళ్ళు, 23 ఐరన్ ర్యాకులు, 7 రిఫ్రిజిరేటర్లు, ఐదు ప్రింటర్లు, 10 మెడిసిన్ స్టోరేజ్ ర్యాకులు, 100 మెడిసిన్ స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బుచ్చిరెడ్డిపాలెం సి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు వైద్య పరికరాలు, అవసరమైన సామాగ్రి కొరతను సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ ను సమకూర్చడం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఒక అడుగు ముందుకు పడిందన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు ప్రతి నెల 9వ తేదీ నిర్వహించే ఏఎంసీ పరీక్షలతో పాటు థైరాయిడ్ పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు గతంలో అందుబాటులో లేవని ఇప్పుడు వాటిని సమకూర్చామని వివరించారు. ప్రజలు వైద్యులను దైవ స్వరూపంగా భావిస్తారని ఎమ్మెల్యే అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం సి హెచ్ సి లో గతంలో నెలకు సుమారు 30 ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 46కు పెరగడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది వైద్యులు,సిబ్బంది అందిస్తున్న సేవలకు నిదర్శనం అన్నారు. అందుబాటులోకి వచ్చిన పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ, ఓర్పుతో, అంకిత భావంతో పనిచేసి పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.