పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్‌లో కలకలం
నిజామాబాద్, సూర్య ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కలకలం రేగింది. సుధాకర్ అనే వ్యక్తి స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అందుతున్న సమాచారం ప్రకారం, సుధాకర్ తన హోటల్ బయట టేబుళ్లు ఏర్పాటు చేయడంపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని చెప్పేందుకు ఆయనను స్టేషన్‌కు పిలిపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మంటల్లో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను వెంటనే ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు నుంచి ఘటన వరకు జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు టెలీ-మానస్ హెల్ప్‌లైన్ 14416 కు ఉచితంగా కాల్ చేసి సహాయం పొందవచ్చు.)