పండుగల సాయన్న చిత్రపటం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30):చౌడాపూర్ గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగల సాయన్న చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పండుగల సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గుంత తవ్వి, అక్కడ ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశామని గ్రామస్తులు తెలిపారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చిత్రపటాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనతో ముదిరాజ్, బీసీ వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. చిత్రపటాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు ఉన్నారు.