నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులకు శిక్షణ
42 మంది ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందితో మూడో బ్యాచ్ ప్రారంభం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా వ్యవహరించేలా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డీటీసీ) ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసులకు నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మూడో బ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్యాచ్‌లో వివిధ హోదాలకు చెందిన 42 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ శిక్షణలో నూతన క్రిమినల్ చట్టాల్లోని కీలక నిబంధనలు, వాటి అమలు విధానం, విధి నిర్వహణలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలు, కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించడం, దర్యాప్తు ప్రక్రియలో నిబంధనలను పక్కాగా పాటించడం, పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడం లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది.