నిజాయితీగూడెంలో నింగినంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
సూర్య - మానకొండూర్: మండలంలోని నిజాయితీగూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. శ్రీ దుర్గ మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో గ్రామ మహిళలు, భవాని మాలధారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాల్లో మునిగితేలారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను గ్రామ చౌరస్తాలో ఉంచి, మహిళలు పూల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. ఆ తర్వాత ఊరేగింపుగా వెళ్లి స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శామంతుల శ్రీనివాస్, ఆడెపు రమేష్, గడ్డి కుమార్, దొంగల శ్రీధర్, కాల్వ అజయ్, గడ్డి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్, గడ్డి రమేష్‌లతో పాటు కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. వేడుకలు విజయవంతం కావడంతో గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది.