నస్పూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సూర్య, నస్పూర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ దంపతులు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాంతం 32, 33, 34వ డివిజన్లలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో మేయర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో సందడి చేసి, వారికి సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించడం మన సంప్రదాయ గొప్పతనానికి నిదర్శనమన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అగ్గు సాగర్, ఎంబడి కుమారస్వామి , స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆయా డివిజన్ల మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.