telanagana
నస్పూర్ రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి
- మృతుల సంఖ్య ఆరుకు చేరింది - ఆరుగురూ మహిళలే
01 సూర్య నస్పూర్, నస్పూర్ గేటు వద్ద సెప్టెంబర్ 28న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న మందమరి మండలం వెంకటాపూర్‌కు చెందిన సల్లూరి అనూష (మహిళ) శనివారం ఉదయం మృతి చెందింది. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా.. మృతులంతా మహిళలే కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే అనూషను తీవ్ర గాయాలతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూసింది. అనూష కుటుంబం మధ్యతరగతికి చెందినది. ఆమె తండ్రి మల్లయ్య కూలి పని చేస్తుండగా, ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. కుటుంబానికి అండగా నిలిచేందుకు మంచిర్యాలలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తూ జీవనం సాగించేది. అనూష మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకే ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వరుస మరణాలతో వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.