ప్రజా ప్రయోజనమే జర్నలిజం ప్రధాన లక్ష్యం -వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు పాత్రికేయులు : ఎమ్మెల్యే పులివర్తి నాని
సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే జర్నలిజం ప్రధాన ఉద్దేశమని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో శనివారం సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరుల రెండు రోజుల పునశ్చరణ తరగతుల్లో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ జర్నలిజంపై ప్రేమతో పనిచేస్తున్న గ్రామీణ విలేకరులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార విధానాలకు అనుగుణంగా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా వార్తలను సంక్షిప్తంగా, స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా అందించడం జర్నలిస్టులకు అవసరమైన ముఖ్యమైన నైపుణ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామీణ విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛలోనే పత్రికా స్వేచ్ఛ ఇమిడి ఉందని, ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పాత్రికేయులు పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సురేష్ పిళ్లై, విజయ్ కుమార్, డాక్టర్ ఎం ప్రసాద్, జిల్లా విలేకరులు, విద్యార్ధిలు, సీఆర్ మీడియా అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి