పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు
ఒక్కరోజే రూ.6 లక్షలు దాటిన ఆదాయం - కన్నుల పండువగా సహస్ర దీపాలంకరణ, తిరుచ్చి సేవలు
నెల్లూరు కల్చరల్/ రాపూరు మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ చెంచులక్ష్మి, శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం సందర్భంగా స్వామివారికి వేకువజామున 4 గంటలకు అభిషేకం, ఉదయం 10.30 గంటలకు శ్రీవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు భక్తులు సమర్పించిన 100 గొడుగులతో స్వామివారికి తిరుచ్చి సేవ, సహస్ర దీపాలంకరణ సేవను అత్యంత వైభవంగా జరిపారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, అన్నదానం తదితర ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది పకడ్బందీగా చేపట్టారు.వివిధ సేవల ద్వారా ఒక్కరోజే ఆలయానికి రూ.6,11,099 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేశారు.బద్వేల్ వాస్తవ్యులు చాటకొండు ఓబులేసు, గుర్రమ్మ దంపతుల కుమారుడు నరసింహులు శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 1,01,116 నగదును ఆలయ ఉప కమిషనర్ కు విరాళంగా అందజేశారు.