telanagana
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సూర్య బాల్కొండ /ముప్కాల్:ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తంగేడు, గునుగు, చామంతి, బంతి, గులాబీ తదితర రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు ఆలపించారు. కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ చావన్ రాజేందర్ మాట్లాడుతూ, ప్రకృతిని, పూలను ఆరాధించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెరగడంతో పాటు ఐక్యత, సోదరభావం వంటి విలువలు అలవడతాయని తెలిపారు. మహిళలందరూ ఒక్కటై ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.విద్యార్థినులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పాఠశాల ప్రాంగణం పూల సోయగాలతో కళకళలాడింది. సంప్రదాయ కళలు, జానపద గీతాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.