మోదీ లేని భారత్‌ను ఊహించలేం...
సూర్య కరీంనగర్ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని కరీంనగర్‌లో సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, ప్రజల కోసం మోదీ అందించిన సేవలకు గుర్తుగా సేవా జ్యోతి నిర్వహించామని చెప్పారు. ప్రతి పేదింట్లో వెలుగులు నింపుతూ దేశాభివృద్ధి కోసం మోదీ కృషి చేస్తున్నారని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి దేశ ప్రజలే కుటుంబమని, దేశ సేవే ఆయన లక్ష్యమని అన్నారు.
కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని యువతకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. 2014కు ముందు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి దేశంలో జరిగిన అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మోదీ రాజకీయ ప్రస్థానం, చరిత్ర, దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా ప్రజాసేవ కొనసాగించే వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సేవా జ్యోతి నిర్వహించామని తెలిపారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, అది బీజేపీకి చెందిన సంస్థ కాదని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగ సంస్థలను బదనాం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అంశంపై కోర్టును ఆశ్రయించాలని, రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని అన్నారు. వందల మందితో వెళ్లి దాడి చేస్తే అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా సవరణపై మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులైన వారి పేర్లను తొలగించడమే లక్ష్యమని చెప్పారు. మృతుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగితే వాటిని తొలగించడం తప్పా అని ప్రశ్నించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమ, డూప్లికేట్ ఓట్లపై కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రస్తావించారు. తెలంగాణలో అక్రమ చొరబాటుదారుల ఓట్లపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘానికి, బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం తప్పు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. కేసీఆర్ భూ వివాదాలు, బీఆర్‌ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్‌ఎస్ పోరాడలేకపోతోందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు.
తనకు బీజేపీ అనేక పదవులు ఇచ్చిందని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని, సాధారణ కార్యకర్తగా కూడా పార్టీ కోసం పనిచేస్తానని బండి సంజయ్ తెలిపారు.