మహబూబ్ నగర్ --- నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు..
#. వివాదాలు సృష్టించడం సరికాదు... తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్గొండ జిల్లా బ్యూరో, న్యూస్....
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడాలని,పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి రెండు జిల్లాలకు నీటి కేటాయింపులపై సామరస్యపూర్వకంగా జరగాలనిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలన్నారు.
కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కొలిచారు.
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, కరువు పరిస్థితులు, విద్యుత్ సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆనాడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎంతోమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో నేడు జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు వ్యవహరించడం బాధాకరం. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది" అని అన్నారు.మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాంతానికి, 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరుమహబూబ్నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అనవసరమైన వివాదాలు సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
నల్గొండ జిల్లా దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతమని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడాలంటే సురక్షితమైన తాగునీటితో పాటు సాగునీటి వసతులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు రాజకీయ, ప్రాంతీయ వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. రెండు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా సాంకేతిక సలహాలు, సూచనలు అందించి ప్రాజెక్టుల పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించుకుని, ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి ఏ జిల్లాకు ఎంత నీరు అవసరమో సామరస్యపూర్వకంగా నిర్ణయించుకోవాలని సూచించారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా రబీ సీజన్లో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని, జిల్లాల మధ్య వివాదాలకు తావులేకుండా పరస్పర సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
పిలుపునిచ్చారు.